ఈ జెనరేషన్‌కు చెందిన విద్యార్థులు చాలా తెలివైనవారనీ, వారి మేధస్సు మనతరం కంటే చాలా రెట్లు ఎక్కువగా పని చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడారు. కొండపాక వేద ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు.. విద్యార్థులు చేసిన ప్రయోగాలను దగ్గరుండి పరిశీలించారు. వారు చేసిన ప్రయోగాల లక్ష్యాలను ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పిన సమాధానాలకు మంత్రి ముచ్చటపడ్డారు. వారి మేదస్సును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని మంత్రి సంతోషంగా తెలిపారు. పర్యావరణ హితంగా వారు చేసిన ప్రయోగాలు అద్భుతం అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు, స్థానిక ప్రాజా ప్రతినిధులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.